ఫాలోఆన్ ఆడుతున్న భారత్ నేపియర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడడం ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో భారత్ ఫాలోఆన్ గండంనుంచి బయట పడలేక పోయింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 619 పరుగుల భారీ స్కోరు సాధించగా భారత్ కేవలం 305 పరుగులు మాత్రమే సాధించి 314 పరుగులు వెనకబడడంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.
ఫాలోఆన్‌లో భాగంగా ప్రస్తుతం భారత తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 9 పరుగుల వద్ద కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (3), వీరేంద్ర సెహ్వాగ్ (6)లు క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ మరోసారి తడబడింది. దీనికితోడు కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మూడోరోజు ఆటలోనూ భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ద్రావిడ్ (83), వీవీఎస్ లక్ష్మణ్ (76)లు మాత్రమే రాణించగా, సచిన్ (49) ఫర్వాలేదనిపించాడు.
కివీస్ బౌలర్లలో మార్టిన్ మూడు వికెట్లు సాధించగా, వెటోరీ, బ్రైన్, పటేల్‌లు రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు. రైడర్ తనవంతుగా ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 619 పరగులు భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే.