ప్రసార హక్కుల కోసం లంచం పుచ్చుకున్న డబ్ల్యూఎస్జీ చీఫ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులను సోనీ మల్టీ స్క్రీన్ మీడియాకు ఇచ్చేందుకుగాను స్పోర్ట్స్ వరల్డ్ గ్రూప్ (డబ్ల్యూఎస్జీ) సంస్థ రూ.125 కోట్లను లంచం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సోదాల్లో కనుగొన్నట్లు ఆదాయ పన్ను శాఖాధికారులు నిర్ధారించారు. ఇంకా రూ.125 కోట్లను లంచంగా పుచ్చుకోవడం నిజమేనని డబ్ల్యూఎస్జీ అధ్యక్షుడు అంగీకరించినట్లు ఐటీ శాఖాధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసే మల్టీమీడియా కేంద్రాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనీ మల్టీమీడియా స్క్రీన్ మీడియా మరియు డబ్ల్యూఎస్జీ కార్యాలపై 50 మంది ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేశారు. ఇంకా ఈ సంస్థలకు చెందిన ఉన్నత అధికారుల వద్ద ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ జరిపారు. ఇందులో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం రూ.125 కోట్లను లంచంగా పుచ్చుకున్న విషయం నిజమేనని డబ్ల్యూఎస్జీ అధ్యక్షుడు వేణు నాయర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ మల్టీ మీడియా స్క్రీన్ సంస్థలో కేంద్ర మంత్రి శరద్ పవార్ అల్లుడు సదానంద్ సులే పది శాతం వాటా కలిగి వుండేవారని తెలిసింది.