వచ్చే నవంబరు నెలలో జరుపతలపెట్టిన పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బుధవారం రద్దు చేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి చేసిన నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్టు కివీస్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి జస్టిన్ వాగన్ వెల్లడించారు.
తాము పాక్‌కు వెళ్ళడం లేదు. భవిష్యత్‌లో కూడా ఏ క్రికెట్ జట్టు కూడా పాక్‌లో పర్యటించలేవని రేడియో న్యూస్ ప్రతినిధితో అన్నారు. అయితే, గల్ఫ్ దేశాలైన అబుదాబి వంటి తటస్థ వేదికలపై ఆడే అవకాశాలు ఉన్నట్టు ఆయన చెప్పారు. గతంలో కూడా అబుదాబిలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడినట్టు ఆయన గుర్తు చేశారు.
కాగా, గత 2002 సంవత్సరంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ దేశ ఆటగాళ్లు బసచేసిన హోటల్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెల్సిందే. దీంతో కివీస్ పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుంది.
గడాఫీ స్టేడియం సమీపంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు క్రికెటర్లు గాయాలబారిన పడగా, ఆరుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. దీంతో పాక్ పర్యటనను శ్రీలంక జట్టు రద్దు చేసుకుని స్వదేశానికి సురక్షితంగా చేరుకుంది.