న్యూఢిల్లీ చేరిన మోడీ.. టాప్ లాయర్స్‌తో భేటీ..!!
ఇప్పటిదాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమీషనర్‌గా పనిచేసి, సస్పెన్షన్‌కు గురైన లలిత్ మోడీ, దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ చేరుకున్నాడు. తన సస్పెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)తో న్యాయ పోరాటానికి సిద్ధమైన మోడీ.. ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాం జెఠ్మలానీలతో భేటీ అయ్యాడు.ముందుగా సాల్వేతో సమావేశమైన మోడీ, దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపాడు. ఆ తరువాత రాం జెఠ్మలానీతో సమావేశమై కొంతసేపు పలు విషయాలపై చర్చించాడు. కాగా.. ఈ సమావేశంలో ఐపీఎల్ తాజా వివాదాలపై బీసీసీఐకి షోకాజ్ నోటీస్ జారీ చేసే అంశంపై మోడీ న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది.అనంతరం మీడియా ప్రతినిధులు మోడీని కలిసి న్యాయవాదులతో భేటీ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇందులో చెప్పడానికి ఏమీ లేదనీ అన్నాడు. తాను ఏదైనా చెబుతానని మీరు ఎంతసేపు హోటల్ గది బయట వేచి చూసినా ప్రయోజనం లేదనీ, తానే విషయాలను చెప్పదల్చుకోలేదని మోడీ మీడియాకు సూటిగా తేల్చి చెప్పాడు. తాను ఢిల్లీ వచ్చింది చూస్తారనీ, వెళ్లిపోయేదీ చూస్తారనీ.. అంతేగానీ ఎలాంటి విషయాలను తననుంచి రాబట్టలేరని అన్నాడు.