కివీస్ పర్యటనలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం నేపియర్‌లోని మెక్‌లీన్ మైదానంలో జరిగిన తొలి వన్డే డే అండ్ నైట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా సమిష్టిగా రాణించి 53 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది.
తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ చేపట్టాడు. అయితే ఆరంభంలోనే వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 273 పరుగులు భారీ స్కోరు చేసింది. భారత ఓపెనర్లు సెహ్వాగ్ (77), సచిన్ (20)ల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (84 నాటౌట్), సురేష్ రైనా (66), పఠాన్ (21 నాటౌట్)లు రాణించడంతో భారత జట్టు కివీస్ ముంగిట భారీ విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. కివీస్ బౌలర్లలో బుట్లర్, వెట్టోరి, ఇలియట్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ఇన్నింగ్స్‌కు వర్షం మరోమారు అంతరాయం కలిగింది.
దీంతో కివీస్ విజయలక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ నిబంధన మేరకు 28 ఓవర్లలో 216 పరుగులకు కుదించారు. అయితే, చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో కివీస్ బ్యాట్స్‌మెన్స్ భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లను సమర్పించుకున్నారు. కివీస్ బ్యాట్స్‌మెన్స్‌లలో గుప్తిల్ (64), టేలర్ (34), డేనియల్ వెట్టోరి (26 నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు.
భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు, ప్రవీణ్ కుమారు రెండు, జహీర్, యువరాజ్ సింగ్ ఒక్కో వికెట్ చొప్పున తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందుకున్నాడు. రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లలో భారత్ వరుస ఓటములు చవి చూసిన విషయం తెల్సిందే.