ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కేంద్ర హోం మంత్రి చిదంబరంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహకులు సోమవారం మరోమారు సమావేశం కానున్నారు. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించ తలపెట్టిన ఐపీఎల్ సీజన్-2 పోటీలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రతిబంధకంగా మారిన విషయం తెల్సిందే. ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెప్పాయి.
దీంతో తొలుత ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేసి, హోం శాఖకు సమర్పించాయి. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సవరించిన షెడ్యూల్ తేదీల్లో కూడా భద్రత కల్పించలేమని చేతులెత్తేశాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ, కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరంతో సోమవారం సమావేశం కానున్నారు. ఇందులో ఆటగాళ్ళ భద్రత, తేదీల ఖరాలు తదితర అంశాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.