యుద్ధం లాంటి పరిస్థితిలో మ్యాచ్ అధికారులను నిస్సహాయ స్థితిలో వదిలివేశారని ప్రపంచ నెంబర్వన్ అంపైర్ సైమన్ టోఫెల్ పాకిస్థాన్ భద్రతా సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తమ కాన్వాయ్‌లో 25 మంది సాయుధ కమెండోలు ఉన్నప్పటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా ఎందుకు పట్టుకోలేక పోయారని సైమన్ ధ్వజమెత్తారు. ఒకవైపు శ్రీలంక జట్టు బస్సు ముందుకెళ్తున్నప్పటికీ... తమ చావుకు తమను వదిలివేశారని ఆయన ఆవేదనగా చెప్పాడు.
ఆ విషయం తల్చుకుంటేనే, పట్టరాని కోపం వస్తోందనీ... తమను ఒంటరివాళ్లను చేశారనీ, ఆటగాళ్లతో సమానంగా తమకు భద్రత కల్పించలేదనీ సైమన్ ఆరోపించాడు. శ్రీలంక జట్టు మైదానానికి చేరినప్పటికీ, తమకోసం ఒక్కరు కూడా రాలేదని అన్నాడు. పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి, చివరకు తమను దుర్భర స్థితిలో వదిలివేశారని మరో ఆస్ట్రేలియా అంపైర్ స్టీవ్ డేవిడ్ విచారం వ్యక్తం చేశాడు.