ఐపీఎల్ తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రెండో సీజన్‌కు పటిష్టంగా ఉందని సూపర్ కింగ్స్ సెలక్టర్, మాజీ క్రికెటర్ వి. బి. చంద్రశేఖర్ అన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చెన్నై సూపర్ సింగ్స్ జట్టు బలోపేతమైందని, రెండో సీజన్‌లో తమ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తారని చంద్రశేఖర్ వెల్లడించారు.
దాదాపు 27 మంది అద్భుత క్రికెటర్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రెండో సీజన్‌కు సిద్ధంగా ఉందని చంద్రశేఖర్ అన్నారు. ఒకవేళ మైదానంలో ఆటగాళ్లు గాయాలకు గురైతే వారి స్థానంలో వేరొక క్రికెటర్‌ను బరిలోకి దింపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకున్నామని చంద్రశేఖర్ అన్నారు.
సూపర్ కింగ్స్ క్రికెటర్లకు దక్షిణాఫ్రికాలో తగిన శిక్షణను అందిస్తున్నామని చంద్రశేఖర్ వెల్లడించారు. ఏప్రిల్ 18వ తేదీన కేప్‌టౌన్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తారని చంద్రశేఖర్ నమ్మకం వ్యక్తం చేశారు.
టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో.. సుదీప్ త్యాగి, పర్తీవ్ పటేల్, జోగిందర్ శర్మ, సురేష్ రైనా, మన్‌ప్రీత్ సింగ్ గోనిలతో పాటు, జార్జ్ బెయిలీ, మాథ్యూ హేడెన్, మైక్ హస్సీ (ఆస్ట్రేలియా), స్టీఫన్ ఫ్లెమ్మింగ్, జాకోబ్ ఓరమ్ (న్యూజిలాండ్), తైలాన్ తుషారా, ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), అల్బీ మోర్కెల్, మఖాయా నితిని (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు.