ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ వేదికగా దక్షిణాఫ్రికాను ఎంపిక చేశారు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలు ఐపీఎల్ ఆతిథ్య రేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిర్వాహకులు దక్షిణాఫ్రికావైపే మొగ్గుచూపారు. అనుకూల వాతావరణ పరిస్థితులు, పటిష్ట భద్రతపై హామీ, ఇబ్బందిలేని దేశవాళీ సీజన్, ప్రసార హక్కుల వివాదం లేకపోవడం, నిర్వహణ వ్యయం కూడా తక్కువ కావడంతో ఐపీఎల్ యాజమాన్యం టోర్నీ వేదికగా దక్షిణాఫ్రికాను ఎంపిక చేసింది.
అయితే టోర్నీని ఒక వారం కుదించారు. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న టోర్నీ ప్రారంభం కావాల్సివుండగా, దీనిని గత ఏడాది మాదిరిగానే ఏప్రిల్ 18న ప్రారంభించాలని నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఎనిమిది మైదానాల్లో ఐపీఎల్ రెండో సీజన్ 59 మ్యాచ్‌లు జరుగుతాయి. మే-24నే ఫైనల్ నిర్వహిస్తారు. ఐపీఎల్ రెండో సీజన్ నిర్వహణపై టోర్నీ కమిషనర్ లలిత్ మోడీ మంగళవారం జోహానెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈవో గెరాల్డ్ మజోలాతో సమావేశమయ్యారు.
పటిష్ట భద్రత కల్పిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో టోర్నీని ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు లలిత్ మోడీ ఈ సమావేశం అనంతరం ప్రకటించారు. తాజా షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లోగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా ప్రజల్లో ట్వంటీ- 20 క్రికెట్‌పై ఉన్న ఇష్టం, ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విజయవంతంగా నిర్వహించడం తదితర అంశాలు తమను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి వాతావరణం కూడా క్రికెట్‌కు అనుకూలంగా ఉంటుందన్నారు. కేప్‌టౌన్‌లో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 18న మ్యాచ్‌లు మొదలవతాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమవతాయి. రెండో మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు టోర్నీ నిర్వాహకులు ఇంగ్లాండ్‌వైపు మొగ్గుచూపకుండా చేశాయి. దీనికితోడు తక్కువ వ్యవధిలో భద్రత కల్పించడం కష్టమవుతుందని ఇంగ్లాండ్ పోలీసులు అభిప్రాయపడటం కూడా ఐపీఎల్- 2ని దక్షిణాఫ్రికా దక్కించుకోవడానికి కారణమైంది.