ట్వంటీ-20.. వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఆడేది లేదు: ఐసీసీ
కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్‌కు ముందుగా జరిగే వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఆడేది లేదని తెలిసింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించే టీం ఇండియా బిజీ షెడ్యూల్ కారణంగా.. వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఆడేది లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. అయితే భారత మహిళా క్రికెట్ జట్టు మాత్రం మే రెండో తేదీన ఇంగ్లాండ్‌తో, మే మూడో తేదీన దక్షిణాఫ్రికాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 30వతేదీన ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20కి ధోనీ సేన సిద్ధమవుతోంది. కాగా.. ముంబైలో ఐపీఎల్ మూడో సీజన్ ఏప్రిల్ 25వ తేదీన సమాప్తం కానుండటంతో... భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు వీలుపడదని ఐసీసీ వెల్లడించింది. ఇకపోతే.. ఏప్రిల్ 30వతేదీన వెస్టిండీస్‌లోని గుయానాలో తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్వంటీ-20 టీం ఇండియా పురుషుల జట్టు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 29 తేదీల వరకు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు 25వ తేదీతో ముగియనుండటంతో, వెంటనే భారత జట్టు వార్మప్ మ్యాచ్‌ల్లో ఆడటం కుదరని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.