ట్వంటీ-20 ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణలో హారూన్ లోర్గాత్!
ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ హారూన్ లోర్గాన్ పాల్గొననున్నారు. ఇందులో విశేషమేమిటంటే..? పాకిస్థాన్లో ఈ నెల 15వ తేదీన జరిగే ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో లోర్గాత్ పాల్గొనడమే. ఇదే రోజున హారూన్ లోర్గాత్ విలేకరులతో మాట్లాడుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విలేకరుల సమావేశంలో పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్, పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ అఫ్రిదిలు పాల్గొంటారని పీసీబీ వెల్లడించింది. గత ఏడాది 2009 మార్చిలో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన తీవ్రవాద దాడుల అనంతరం ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాకిస్థాన్లో ఆడేందుకు వెనుకడుగు వేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాది దాడికి తర్వాత పాక్లో జరగే ప్రపంచకప్ ట్వంటీ-20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో లోర్గాత్ పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. హారూన్ లోర్గాత్తో పాటు ఐసీసీ అధికారులు కూడా పాక్లో జరిగే వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.