టీ-20 ఎంపిక.. ఆటగాళ్లపై ప్రభావం చూపదు: కుంబ్లే
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో ఆడేందుకుగాను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపికయ్యారు. దీంతో మిగిలిన మ్యాచ్ల్లో ఆటగాళ్ల మధ్య సమన్వయం పాటించబోరనే వాఖ్యలపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ప్రపంచకప్లో ఆడేందుకు తమ జట్టు తరపున ప్రవీణ్ కుమార్, వినయ్ కుమార్లు ఎంపిక విషయం తెలిసిందే. ట్వంటీ-20 జట్టుకు ఎంపికైనప్పటికీ ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. అయితే ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ కీలకమే అయినందున ఆటపైనే దృష్టి నిలుపుతూ ముందుకు సాగుతున్నామని కుంబ్లే వెల్లడించాడు. ప్రపంచకప్ జట్టులో స్థానంపై తమ ఆటగాళ్లు పూర్తి విశ్వాసంతో లేకపోయినా ఈ అవకాశం లభించడం గొప్ప విషయమని కుంబ్లే చెప్పుకొచ్చాడు. దీనికి తన స్వీయ అనుభవమే మంచి ఉదాహరణ. క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో ఏనాడూ భారతజట్టుకు ఎంపిక గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎప్పటిలాగే తన ప్రదర్శనపై దృష్టి సారించానని కుంబ్లే తెలిపాడు.