అంతర్జాతీయ క్రికెట్‌లో గత రెండు దశాబ్దాలుగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ... మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ప్రస్తుత జట్టే "అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్"ను కలిగి ఉందని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మూడో వన్డే అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ... ప్రస్తుత జట్టులో స్వేచ్ఛగా బంతిని బౌండరీ దాటించే ఆటగాళ్లు ఐదారుగురు ఉన్నారనీ, వరుసగా ఐదారు ఓవర్లలో వేగంగా స్కోరు చేసినట్లయితే 50 పరుగులు వచ్చేస్తాయని వ్యాఖ్యానించాడు.
సెహ్వాగ్‌తో కలిసి తాను ఆడుతున్నట్లయితే... పరిస్థితిని బట్టి బ్యాటింగ్ తీరును మలచుకుంటాననీ, సెహ్వాగ్ ఆడుతున్న సమయంలో జోరు తగ్గించుకోవడమే ఉత్తమమని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు. భారీ షాట్లను అలవోకగా సంధించేందుకు వీలుగా, వీరూకే ఎక్కువగా ఆడేందుకు అవకాశం ఇస్తానని చెప్పాడు.
ఇదిలా ఉంటే... తన కెరీర్‌లోని విలువైన అతి కొద్ది ఇన్నింగ్స్‌లో కివీస్‌తో ఆడిన ఈ రెండో వన్డేకు స్థానం కల్పిస్తాననీ, ఒక దశలో పరుగులు రాలేకపోయినా.. నిలదొక్కుకున్నాక చేసిన బ్యాటింగ్ సంతృప్తినిచ్చిందని సచిన్ తెలిపాడు. 1994లో ఓపెనర్‌గా మారిన తాను.. అప్పటినుంచీ కివీస్ గడ్డపై సెంచరీకి చేరువగా వచ్చి విఫలమయ్యాననీ... అయితే ఈసారి పర్యటనలో తొలి సెంచరీని నమోదు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
ఇకపోతే రిటైర్డ్ హర్ట్‌గా ఎందుకు తిరిగి వెళ్ళాల్సి వచ్చిందంటే... గత మ్యాచ్‌లో ఒబ్రియాన్ బౌలింగ్‌లో బంతి ఉదర భాగంలో గట్టిగా తగిలిందనీ, ఈ మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన తరువాత ఆ నొప్పి తిరగబెట్టిందని, సెంచరీ దాటాకా తీవ్రమైందని సచిన్ వివరించాడు. అందుకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.