మోకాలి గాయం కారణంగా, గత జనవరిలో శ్రీలంక ఆఖరి వన్డేతో పాచు టెస్టు సిరీస్‌కు దూరమైన పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ తిరిగి జట్టులో చోటు సంపాదించడం కోసం తీవ్రంగా శ్రమిస్తానని అంటున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి రావాలని అక్తర్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.
ఈ విషయమై అక్తర్ మాట్లాడుతూ.. మోకాలి గాయం నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. ఇక బౌలింగ్‌లో గట్టి ఆటతీరును తిరిగి పొందేందుకు, తీవ్రంగా శ్రమిస్తున్నానని అక్తర్ తెలిపాడు. బౌలింగ్‌లో అదే లయని తిరిగి పుచ్చుకున్నట్లైతే, ఫామ్‌లో పడినట్లే అవుతుందని అక్తర్ అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టును ప్రస్తుత పరిస్థితిల్లో ఓడించడం సులభమని, తప్పకుండా జట్టులో స్థానం దొరికితే ధీటుగా రాణిస్తానని అక్తర్ వెల్లడించాడు. నాలుగేళ్ల క్రితం ఆసీస్ మంచి ఫామ్‌లో ఉన్నదని, ప్రస్తుతం ఆ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతోందని, తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిందని అక్తర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే తన ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు సలీమ్ జాఫర్‌ను పీసీబీ ప్రత్యేకంగా నియమించింది. యూఎఈలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో అక్తర్‌తో పాటు మహ్మద్ యూసఫ్ కూడా జట్టులో ఉండాలని పాక్ జట్టు సారథి యూనిస్ ఖాన్ కోరుకుంటున్నాడు.