నిధుల సేకరణ కోసం న్యూజిలాండ్ మాస్టర్స్ జట్టు నిర్వహించ తలపెట్టిన ఛారిటీ మ్యాచ్‌లలో ఆడేందుకు అంగీకరించిన భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకున్నాడు. ఈ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అంగీకరించని కారణంగా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సచిన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లు న్యూజిలాండ్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్లు తలపెట్టిన చారిటీ మ్యాచ్‌లలో ఆడేందుకు గురువారం తమ సంసిద్ధతను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తమకు బద్ధ విరోధి అయిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో పాల్గొన్న హమీష్ మార్షల్ ఆడుతున్న జట్టులో సచిన్ పాల్గొనేందుకు బీసీసీఐ సుతరామూ ఒప్పుకోలేదు. దీంతో సచిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.
అలాగే, కార్తీక్ కూడా ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడబోడని బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే... మాజీ కివీస్ బ్యాట్స్‌మెన్ అయిన మార్షల్ గత సంవత్సరం జరిగిన ఐసీఎల్‌లో రాయల్ బెంగాల్ టైగర్స్ జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.