ఐపీఎల్- 3 పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ విజయంపై పెట్టుకున్న ఆశలను విజయ్(78) వమ్ము చేశాడు. కేవలం 34 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 78 పరుగులు చేసి బెంగళూరును బోల్తా కొట్టించాడు.
విజయ్‌కు రైనా(44) తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. వరుస ఓటములను చవిచూస్తున్న ధోనీ సేనకు ఈ విజయంతో కాస్త ఊరట లభించినట్లయింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరూ ప్రతిభావంతమైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ స్థిరమైన ఆటతీరును ప్రదర్శించారు. కోహ్లి- జాక్వెస్ కలిస్ ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ప్రత్యర్థి జట్టు ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.