కోల్కతా నైట్రైడర్స్ కోచ్ జాన్ బుచానన్ శుక్రవారం ఆ జట్టు ప్రధాన ఆటగాడు సౌరవ్ గంగూలీపై నిప్పులు చెరిగారు. ఇటీవల జాన్ బుచానన్ ఐపీఎల్ రెండో సీజన్‌లో తమ జట్టుకు ఏ ఒక్క ఆటగాడో కెప్టెన్‌గా ఉండడని, నలుగురైదుగురు కెప్టెన్లు ఉంటారని చేసిన ప్రకటన క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
ఇది చిన్నగా ఇంటా, బయటా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజర్ జాన్ బుచానన్ మాట్లాడుతూ.. గంగూలీకి తెలియకుండా ఏదీ రహస్యంగా ఉంచలేదన్నారు. కెప్టెన్సీ మార్పుల గురించి ఐపీఎల్ తొలి సీజన్ ముగిసిన వెంటనే గంగూలీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
అంతేకాకుండా కెప్టెన్సీ పుండుపై కారం జల్లుతూ.. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ కెరీర్ చరమాకంలో (పొద్దుకూకే సమయంలో) ట్వంటీ- 20 క్రికెట్‌లోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు రొటేటింగ్ కెప్టెన్లను ఏర్పాటు చేద్దామనే బుచానన్ ఆలోచన పట్ల గంగూలీ నవ్వాడు.
రేపు నేను కూడా బయటకువచ్చి మాకు నలుగురు బ్యాటింగ్ కోచ్‌లు కావాలి. నలుగురు బుచానన్‌లు కావాలని చెప్పొచ్చు. జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తమకు ఆరుగురు ఆండీ బిచెల్‌లు కావాలని ప్రకటించవచ్చని పేర్కొన్నాడు. బుచానన్ కొత్త ఆలోచన గురించి తనకు తెలియదని తాజాగా గంగూలీ ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు.
తాను ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నానన్నాడు. కెప్టెన్సీ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తనను సంప్రదించలేదని గంగూలీ చేసిన ప్రకటనను బుచానన్ కొట్టిపారేశారు. కెప్టెన్సీ మార్పుల గురించి గంగూలీకి తెలుసన్నారు. క్రికెట్ వ్యవహారాల్లో జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తనకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారని చెప్పారు. అయితే రొటేటింగ్ కెప్టెన్ల అంశంపై క్రికెట్ వర్గాల్లో విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి.