న్యూజిలాండ్ గడ్డపై నాలుగు దశాబ్ధాల తర్వాత టెస్టు సిరీస్ గెల్చుకోవడం ద్వారా భారత జట్టు రికార్డు సృష్టించింది. తొలి టెస్టులో విజయం సాధించిన ధోనీ సేన వర్షం కారణంగా మూడో టెస్టులో మాత్రం విజయానికి రెండు వికెట్ల దూరంలో నిల్చిపోయింది. దీంతో మూడు టెస్టుల ఈ సిరీస్‌ను 1-0 తేడాతో గెల్చుకోవడం ద్వారా న్యూజిలాండ్ గడ్డపై నాలుగు దశాబ్ధాల తర్వాత టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టుగా ధోనీ సేన భారత అభిమానులకు తీపి కబురు అందించింది. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి భారత్ భారీ స్కోరు సాధించడానికి కారణమైన గంభీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మూడో టెస్టు చివరిరోజు న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 281 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. దీంతో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించటారు. దీంతో మూడో టెస్టులోనూ విజయం తమదే అని భావించిన ధోనీ సేన డ్రాతో సంతృప్తి పడాల్సివచ్చింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ వెటోరీ (15), ఓబ్రైన్ (19) పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున హర్భజన్ నాలుగు వికెట్లు తీసుకోగా జహీర్‌ఖాన్, సచిన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ టెయిలర్ (107) సెంచరీ సాధించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో టెయిలర్ ఔట్ అయ్యాక మెక్‌కలమ్, ఫ్రాంక్లిన్, సౌతీ వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. దీంతో భారత విజయం లాంఛనప్రాయమే అనుకుంటున్న దశలో వర్షం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
మూడో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరగులు సాధించిన సంగతి తెలిసిందే. సచిన్ (62), హర్భజన్ సింగ్ (60), ధోనీ (52)లు అర్థ సెంచరీలు సాధించగా, సెహ్వాగ్ (48), ద్రావిడ్ (35), జహీర్‌ఖాన్ (33)లు రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 182 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ గంభీర్ (167), లక్ష్మణ్ (61), ద్రావిడ్ (60), ధోనీ (56 నాటౌట్)లు రాణించడంతో 7 వికెట్లకు 434 పరుగుల భారీస్కోరు సాధించిన దశలో ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది.
ఈ నేపథ్యంలో భారత్ విధించిన 617 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకునేందుకై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ప్రారంభంనుంచే తడబడింది. ముఖ్యంగా హర్భజన్ నాలుగు వికెట్లతో కివీస్ భరతం పట్టాడు.