న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలిటెస్టులో భారత్ క్రమంగా పట్టుబిగిస్తోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్ మూడోరోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా కివీస్‌ను త్వరగా ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో మూడోరోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఫ్లైన్ (24) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ తరపున జహీర్‌ఖాన్, మునాఫ్ పటేల్, హర్భజన్‌సింగ్‌లు ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.
అంతకుముందు 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు మరో 36 పరుగులు జోడించిన యువరాజ్ సింగ్ బౌల్డవడంతో తొలి దెబ్బ తగిలింది. అయితే అనంతరం వచ్చిన ధోనీతో కలిసి సచిన్ జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు.
అయితే అనంతరం కొద్దితేడాతో ధోనీ, సచిన్ ఇద్దరూ వెనుదిరిగారు. బౌలర్ జహీర్ ఖాన్ చెలరేగి అర్ధ సెంచరీ సాధించడంతో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ముందురోజు ఓపెనర్ గంభీర్ (72), ద్రావిడ్ (66)లు కూడా అర్ధ సెంచరీలు సాధించి జట్టును ఆదుకున్నారు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 520 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
టీం ఇండియా తరపున మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (160) సెంచరీతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు. కెప్టెన్ ధోనీ (47) తృటిలో అర్ధ సెంచరీ చేజార్చుకోగా, చివరిలో జహీర్ ఖాన్ (51) అర్థసెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లలో మార్టిన్, ఓబ్రైన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, విటోరీ రెండు, మిల్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ టెస్టు ప్రారంభంలో టాస్ గెలిచిన భారత్ ఆతిధ్య జట్టును బ్యాటింగుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ తొలిరోజే 279 పరుగుల వద్ద ఆలౌట్ కావడం ద్వారా తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో రైడర్, వెట్టోరీలు సెంచరీలు సాధించడంతో కివీస్ ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది.