ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: వీరూ నెంబర్‌వన్ స్థానం పదిలం
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో.. టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన నెంబర్‌వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో టాప్ ర్యాంక్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, వీరూ తన స్థానాన్ని కాపాడుకోవటంలో సఫలం అయ్యాడు.కాగా.. న్యూజిలాండ్ టూర్లో మైఖేల్ క్లార్క్ ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో, క్లార్క్ ఐదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టూర్‌కు ముందు క్లార్క్-వీరూల మధ్య కేవలం 16 ర్యాంకింగ్ పాయింట్లు మాత్రమే తేడా ఉండింది. అయితే కివీస్ టూర్లో క్లార్క్ సరిగా క్లిక్ కాకపోవటంతో వీరూ టాప్ ర్యాంక్‌కు గండం తప్పినట్లయ్యింది.ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు హసీమ్ ఆమ్లా రెండో ర్యాంక్‌కు చేరుకోగా.. మరో టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ ఆరవ స్థానంలోనూ, మాస్టర్ బ్లాస్టర్ 7వ స్థానంలోనూ నిలిచి టాప్‌టెన్ బ్యాట్స్మన్లలో చోటు సంపాదించారు. అలాగే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు జహీర్ 6వ, హర్భజన్ సింగ్ 7వ స్థానంతో టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకున్నారు.అలాగే టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో సైతం టీం ఇండియా 124 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో 119 పాయింట్లతో ఆస్ట్రేలియా, 115 పాయింట్లతో 4వ స్థానంలో శ్రీలంక, 108 పాయింట్లతో 5వ స్థానంలో ఇంగ్లండ్, 80 పాయింట్లతో ఆరో స్థానంలో పాకిస్థాన్, 80 పాయింట్లతో 7వ స్థానంలో న్యూజిలాండ్, 77 పాయింట్లతో వెస్టిండీస్ 8వ స్థానంలోనూ నిలిచాయి.