ఐపీఎల్-3 సెమీఫైనల్స్: చెన్నైపై డెక్కన్ ఛార్జర్స్ నెగ్గేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. గురువారం జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్- చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ ఈసారి కూడా ఐపీఎల్-3 టైటిల్‌పై కన్నేసింది. దీంతో గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో చెన్నైపై నెగ్గడమే లక్ష్యంగా డెక్కన్ ఛార్జర్స్ బరిలోకి దిగుతోంది. కాగా.. ఐపీఎల్-3 పట్టికలో 14, 12 పాయింట్లతో డెక్కన్ ఛార్జర్స్, చెన్నై జట్లు నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 14 పాయింట్లతో చెన్నైకి ముందున్న డెక్కన్ ఛార్జర్స్.. మహేంద్ర సింగ్ ధోనీసేనను మట్టికరిపించేందుకు సంసిద్ధమవుతోంది. కానీ ఐపీఎల్ 54వ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. గిల్‌క్రిస్ట్ సేనపై విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్లోకి దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడిన గిల్‌క్రిస్ట్ సేన 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ధేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన డెక్కన్ ఛార్జర్స్.. ఇదే తరహాలో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించాలని తహతహలాడుతోంది. మరోవైపు ఐపీఎల్-3లో 20 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్ల ధీరుడిగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్, సుమన్, గిల్‌క్రిస్ట్ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌పై డెక్కన్ ఛార్జర్స్ గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి మహేంద్ర సింగ్ ధోనీ సేనపై డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్ విజయం సాధించి.. ఫైనల్లోకి అడుగుపెడుతుందో? లేదో..? వేచిచూడాల్సిందే..!.