ఐపీఎల్-3: సచిన్ సేన వరుస విజయాలకు బ్రేక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. మంగళవారం రాత్రి సచిన్సేనతో జరిగిన 37వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ధోనీసేన పది పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. అలాగే ఇంతవరకు ఆడిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం రెండు పరాజయాలను చవిచూసిన ముంబై జట్టు ఐపీఎల్ పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధీటుగా రాణించలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. చెన్నై ఆటగాళ్లలో హేడెన్ (35: 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ధోనీ (31: 18 బంతుల్లో 4 ఫోర్లు), సురేష్రైనా (23: 18 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), బద్రినాథ్ (30 నాటౌట్: 22 బంతుల్లో 4 ఫోర్లు)లు రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పొలార్డ్ రెండు వికెట్లు పడగొట్టగా, భజ్జీ, బ్రావోలు చెరో వికెట్ సాధించారు. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఓవర్లు ముగిసేవరకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 141 పరుగులకే కుప్పకూలింది.ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (45: 35 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో హర్భజన్‌సింగ్ (33: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్‌కు పరాజయం తప్పలేదు. ఇకపోతే.. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డ్ సురేష్‌రైనాకు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అశ్విన్, తుషారా చెరో రెండు వికెట్లు సాధించారు. త్యాగి, బోలింగర్, జకాతి, రైనాలు తలా ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.