Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్-3: రైనా వీర విహారంతో ధోనీ సేన ఘన విజయం

Advertiesment
ఐపీఎల్3
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో సురేష్ రైనా వీర విహారంతో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో తలపడిన సూపర్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి, అలవోక విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా చెన్నై సెమీస్‌కు చేరుకున్నట్లే.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. ప్రారంభంలోనే చెన్నై బౌలర్ అశ్విన్ కోల్‌కతాకు డబుల్ షాక్ ఇస్తూ ఇన్నింగ్ మూడో ఓవర్లే గేల్‌ను 7 పరుగుల వద్ద, మెక్‌కల్లమ్ 0 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే మరో రెండు వికెట్లు టపా, టపా రాలిపోయాయి. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా గంగూలీ బొలింగర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తరువాత డేవిడ్ హసీ అశ్విన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో దాదా సేన పూర్తి కష్టాల్లో మునిగిపోయింది.

ఆ తరువాత మాథ్యూస్, తివారీ జట్టును ఆదుకుని 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో తివారీ కూడా ఔట్ అయ్యాడు. ఆపై వచ్చి శుక్లా 17 పరుగులు సాధించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో మాథ్యూస్ అర్థసెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

140 పరుగులు విజయ లక్ష్యంతో బరిలో దిగిన సూపర్ కింగ్స్ మాయాజాలానికి గంగూలీసేన విలవిలలాడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రైనా, విజయ్ అండగా నిలవటంతో 13.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయం సాధించింది. మ్యాచ్‌ను వేగంగా ముగించడం ద్వారా చెన్నై భారీ రన్‌రేట్‌ సాధించటంతోపాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అశ్విన్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" దక్కించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu