ఐపీఎల్-3 రెండో సెమీస్: డీసీ-చెన్నైల సమరం నేడే..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఓ వైపు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ డీసీ.. ధోనీ సేనపై గెలుపొంది ఫైనల్ ఫైనల్ లక్ష్యంగా బరిలో దిగుతుండగా.. లీగ్ దశలో రెండుసార్లు ఛార్జర్స్ చేతిలో పరాభవం చవిచూసిన చెన్నై ఈసారి ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ చేరేందుకు ఉవ్విళ్లూరుతోంది. దీంతో డీసీ-చెన్నైల మధ్య భీకరమైన పోరాటం జరుగనుందనే చెప్పవచ్చు.గురువారం ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం డీసీ-చెన్నై రెండో సెమీ ఫైనల్ సమరానికి వేదిక కానుంది. ఇందులో డీసీ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలని ఆశిస్తోంటే.. మరోవైపు టోర్నీలో రెండుసార్లు తమను ఓడించిన ఛార్జర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవటమేగాకుండా, ఫైనల్లో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో బరిలో దిగనుంది.అటు డీసీ, ఇటు చెన్నై జట్లు రెండింటిలోనూ స్టార్ ఆటగాళ్లకు లోటు లేదనే చెప్పవచ్చు. ఛార్జర్స్‌ను సెమీస్ చేర్చటంలో ఆల్‌రౌండర్ సైమండ్స్ ముఖ్య భూమిక పోషించటమే గాకుండా.. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారుచేసే ఇతడు 33.66 సగటుతో మొత్తం 404 పరుగులు సాధించి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే డీసీ సెమీస్ చేరటంలో రోహిత్ శర్మ కూడా తనవంతు పాత్రను పోషించాడు. దీంతో బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో డీసీ రోహిత్‌పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అలాగే సుమన్ మంచి ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో ఓజా, హర్మీత్ నిలకడగా రాణిస్తుండటం డీసీకి ఊరనిచ్చే అంశం. అయితే గత ఐదు మ్యాచ్‌లలోనూ డెక్కన్ నెగ్గినా, కెప్టెన్ గిల్‌క్రిస్ట్ వైఫల్యం మాత్రం ఆ జట్టును తీవ్రంగా బాధిస్తోంది. ఇతను మాత్రం కుదురుకుంటే డీసీకి ఎదురే ఉండదని చెప్పవచ్చు. మరోవైపు లీగ్ స్థాయిలో ఛార్జర్స్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఈసారి ఎలాగైనా గెలిచి ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో ఉంది. మురళీవిజయ్, రైనా, హేడెన్, హస్సీ, బద్రీనాథ్, ధోనీలతో బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. ఇక మురళీధరన్, త్యాగి, బొలింగర్, అశ్విన్‌లతో కూడిన బౌలింగ్ లైనప్ ప్రత్యర్థి జట్టుకు కష్టాలు సృష్టించే అవకాశం ఉంది. మొత్తం మీద సమఉజ్జీల సెమీ ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం మాత్రం ఖాయం. మరి ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే..!!