ఐపీఎల్-3: పంజాబ్ కింగ్స్‌పై గంగూలీ సేన నెగ్గేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా.. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సునాయాసంగా నెగ్గాలని గంగూలీ సేన భావిస్తోంది. మొహలీలో శనివారం జరుగనున్న 23వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో గంగూలీ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండింటిలో మాత్రమే నెగ్గింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్, పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్స్ డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్ తప్పకుండా తన ఆరో మ్యాచ్‌ను విజయంతో సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇకపోతే.. కేకేఆర్ తన జట్టులో అద్భుతమైన బౌలర్లను కలిగి ఉంది. దీంతో పంజాబ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ నెగ్గడం సులభమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా క్రిస్ గేల్‌లాంటి స్టార్ బ్యాట్స్మెన్లతో కేకేఆర్‌కు పంజాబ్‌పై విజయం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. కాగా ముంబై ఇండియన్స్‌తో ఈ నెల 22న జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 60 బంతుల్లో 75 పరుగులు సాధించి అజేయంగా నిలవడం గమనార్హం.