ఐపీఎల్-3 అవార్డు ఫంక్షన్‌పై కన్నేసిన ఐటీ అధికారులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ అవార్డు ఫంక్షన్‌పై ఆదాయ పన్ను శాఖ కన్నేసింది. అవార్డు ప్రదానోత్సవానికి ఐపీఎల్ఎంత మొత్తాన్ని వెచ్చిస్తుందనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీసేందుకు సంసిద్ధమయ్యారు. ముంబైలో ఐపీఎల్-3 ఫైనల్ పోరు జరుగనున్న నేపథ్యంలో.. ఫైనల్లో నెగ్గిన జట్టు సభ్యులకు, కెప్టెన్‌కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి పలు విభాగాల్లో ఇచ్చే అవార్డుల వివరాలను సేకరించే పనుల్లో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇంకా విజేతగా నిలిచిన జట్టుకు ఐపీఎల్ ఎంత మొత్తాన్ని ఖర్చు పెడుతుందనే విషయంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. కాగా.. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంతో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ఐటీ అధికారుల ఉచ్చులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐపీఎల్ కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు ఐపీఎల్ అవకతవకల్లో కీలక సూత్రధారి లలిత్ మోడీని రెండో సారి బుధవారం ఒక గంట పాటు ప్రశ్నించారు.