Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ విచారణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్స్..!: ఐటీ శాఖ

Advertiesment
ఐపీఎల్
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అవకతవకలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసింది. కొచ్చి ఫ్రాంచైజీ వివరాలను ట్విట్టర్‌లో పెట్టడం ద్వారా ఐటీ ఉచ్చులో చిక్కుకుపోయిన ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంతో పాటు డబ్బుల పంట పండించే ఐపీఎల్ వ్యవస్థలోని లోటుపాట్లను కనుగొనేందుకు వీలుగా.. దేశ ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలలో ఐటీ శాఖ రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కంట్రోల్ రూమ్స్ ద్వారా ఐపీఎల్ క్రికెట్‌లోని ఆర్థిక అవకతవకలను వివిధ కోణాల్లో విచారించేందుకు వీలవుతుందని ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖచే ఏర్పాటైన ఈ కంట్రోల్ రూమ్స్‌లోని టెలిఫోన్ లైన్స్, ఫ్యాక్స్ మిషన్, ఇంటర్నెట్‌ వసతులతో కూడిన కంప్యూటర్ సిస్టమ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లోని వివరాలను, సమాచారాన్ని పర్యవేక్షించేందుకు ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ (ఐటీఓ) ర్యాంకులో ఉన్న అధికారిని నియమించారు.

డబ్బుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్‌లో విదేశీ నిధులు, ఫ్రాంచైజీల నుంచి వచ్చే నిధుల మొత్తం వంటి ఇతరత్రా అంశాలపై దర్యాప్తు జరిపేందుకు 8 విభాగాలను ఏర్పాటు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ ఎనిమిది విచారణ విభాగాలు పూణే, కొచ్చి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఛండీఘర్, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని ఆదాయ పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఇదిలా ఉంటే... ఐపీఎల్ ఛైర్మన్‌ లలిత్ మోడీ వ్యవహారంలో మరిన్ని వివరాలను వెలికి తీసేందుకు ఐటీ శాఖాధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. బుధవారం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ కార్యాలయాలపై దాడి చేసిన ఐటీ శాఖ గురువారం.. పూణే జట్టును కొనుగోలు చేసిన సహారా గ్రూప్‌ కార్యాలయంపై సోదాలు నిర్వహించింది.

లక్నోలోని పూణే జట్టు కార్యాలయంలో 12 మంది సభ్యులతో కూడిన ఐటీ బృందం సోదాలు చేపట్టింది. అలాగే దేశరాజధాని నగరం, జీఎమ్‌ఆర్‌లో ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ కార్యాలయంలోను సోదాలు జరిపింది

మరోవైపు.. ఐపీఎల్ ఛైర్మన్‌ లలిత్ మోడీని మూడోసారిగా ఐటీకి చెందిన ప్రత్యేక ఈడీ బృందం ప్రశ్నించింది. ఐపీఎల్ ఛైర్మన్‌గా మూడేళ్లపాటు కొనసాగిన లలిత్ మోడీకి భారీ ఆస్తులున్నాయని, కొన్ని పేరు తెలియని సంస్థల్లో వాటాలున్నాయని ఐటీ శాఖకు సమాచారం అందడంతో ముంబైలోని లలిత్ మోడీ కార్యాలయం నిర్లోన్‌లో ఆయనను ఐటీ బృందం ప్రశ్నించింది.

ఏప్రిల్ 15వతేదీన తొలిసారిగా లలిత్ మోడీని 8 గంటల పాటు ఐటీ శాఖ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రెండో సారిగా బుధవారం (ఏప్రిల్ 21) రాత్రి మోడీ వద్ద అదనపు వివరాలకోసం ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మూడో సారిగా గురువారం మోడీ వద్ద ఆస్తుల ఆర్జనపై దర్యాప్తు జరిపింది.

Share this Story:

Follow Webdunia telugu