ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను పట్టిపీడిస్తున్న భద్రతా సమస్యలు ఇంకా తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్ర పోలీసులు తాజాగా ఐపీఎల్ రెండో సీజన్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ రెండూ దాదాపుగా ఒకే సమయంలో జరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం సమస్యాత్మకమైంది.
భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు షెడ్యూల్ మార్పులను ఆశ్రయించిన ఐపీఎల్ నిర్వహకులు, ఇప్పటివరకు అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు చేయలేకపోయారు. ఇటీవల ఐపీఎల్ యాజమాన్యం పంపిన మూడో షెడ్యూల్‌పై మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఐపీఎల్ రెండో సీజన్‌ను వాయిదా వేసుకోవాలని కోరారు. మహారాష్ట్ర డీజీపీ సుప్రకాశ్ చక్రవర్తి క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు సాధ్యపడదని తేల్చిచెప్పారు. క్రికెట్ మ్యాచ్‌ల కంటే ఎన్నికలకు భద్రత కల్పించడం ముఖ్యమన్నారు. కేంద్ర హోంశాఖ ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఈ మ్యాచ్‌లకు భద్రత కల్పించేందుకు తమను ఎన్నికల సంఘం కూడా రాతపూర్వకంగా అనుమతించాలన్నారు.
సాయంత్రం పూట క్రికెట్ చూసే కొంతమంది కోసం పోలీసులను ఎన్నికల విధులకు కాకుండా మ్యాచ్‌ల భద్రతకు కేటాయించేందుకు తాము ఇష్టపడటం లేదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటం పోలీసుల రాజ్యాంగ విధి అని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎన్నికల ముగిసిన అనంతరం, ఏప్రిల్ 30 తరువాత నిర్వహించుకోవాలని సూచించారు.
దీని కోసం రాష్ట్రంలో పోలీసులను అనవసరంగా ఒత్తిడికి గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఇప్పటికీ టోర్నీ నిర్వహణపై ఆశావహంగా ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. వాటిని పరిశీలించిన అనంతరం స్పందిస్తానని చెప్పారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు పారా-మిలటరీ దళాలను ఉపయోగించరాదని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని డీజీపీ వెల్లడించారు. ఐపీఎల్ రెండో సీజన్‌లో జరిగే 18 మ్యాచ్‌ల్లో 14 మ్యాచ్‌లు మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనే జరగాల్సివుంది. అంతేకాకుండా టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు కూడా ముంబయిలోనే జరుగుతాయి.