ఐపీఎల్ ఫ్రాంచైజీ వివాదం: పీసీఏకి ఐటీ క్లీన్‌చీట్!
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖుల హస్తం ఉన్నట్లు ఐటీ శాఖకు సమాచారం అందడంతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, కేంద్ర మంత్రిల శశిథరూర్‌ల కొచ్చి ఫ్రాంచైజీ వివాద ప్రభావం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌పై పడింది. ఫలితంగా ఈ ప్రభావం పీసీఏ కార్యాలయంపై ఐటీ దాడులకు దారితీసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పాటు ఐపీఎల్ కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ)పై ఐటీ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీసీఏ లావాదేవీల్లో ఐపీఎల్ ప్రమేయం ఉందా? లేదా? అనే అంశంపై ముఖ్యమైన అకౌంట్ పుస్తకాలు, డాక్యుమెంట్లను తిరగేశారు. కానీ పీసీఏ లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు చేయలేదని తేలింది. దీంతో ఐటీ పీసీఏకి క్లీన్‌చీట్ ఇచ్చింది. ఇంకా పీసీఏ లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నాయని, నేరంమోపే విధంగా ఎలాంటి అవకతవకలు జరగలేదని ఐటీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ లావాదేవీల్లో పీసీఏకు కూడా భాగం వుందంటూ అందిన సమాచారం మేరకు పీసీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. కానీ పీసీఏ అధికారులు, డాక్యుమెంట్లు, అకౌంట్లను సరిచూడటంతో ఐపీఎల్‌తో పీసీఏకి ఎలాంటి సంబంధం లేనట్లు తెలిసిందన్నారు.