ఐపీఎల్ అవార్డులు: బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా లిటిల్ మాస్టర్..!!
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ "బెస్ట్ బ్యాట్స్‌మన్" అవార్డుకు ఎంపికయ్యాడు. అలాగే డెక్కన్ ఛార్జర్స్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా "బెస్ట్ బౌలర్" అవార్డుకు ఎన్నికయ్యాడు. శుక్రవారం రాత్రి ఆట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉత్తమ కెప్టెన్‌తోపాటు, ఉత్తమ బ్యాట్స్‌మన్ అవార్డు కూడా సచిన్ టెండూల్కర్‌నే వరించటం విశేషంగా చెప్పవచ్చు.అయితే ఈ కార్యక్రమానికి సచిన్, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలు హాజరు కాలేదు. సచిన్ తరపున నీతా అంబానీ, కోచ్ రాబిన్ సింగ్‌లు అవార్డును స్వీకరించారు. అలాగే ఉత్తమ బౌలర్‌గా ప్రజ్ఞాన్ ఓజా, సొగసైన ఆటగాడిగా రాబిన్ ఊతప్ప, నిలకడైన ఆటగాడిగా కలిస్, పొదుపైన బౌలర్‌గా అశ్విన్, ఉత్తమ ఆరంగ్రేటంగా పొలార్డ్ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. అందరూ ఊహించినట్లుగానే ఈ ఐపీఎల్ అవార్డుల కార్యక్రమానికి భారత క్రికెట్ నియంత్రణా మండలి పెద్దలు హాజరుకాలేదు. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ ఉపాధ్యక్షుడు నిరంజన్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవనివారిలో ఉన్నారు.అయితే ఐపీఎల్ కమీషనర్ లలిత్ మోడీ, ఫ్రాంచైజీ యజమానులు విజయ్ మాల్యా, ప్రీతీజింటా, శిల్పాశెట్టి, గాయత్రి రెడ్డి, జై మెహతా తదితరులు ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. బీసీసీఐ పాలక మండలి నుంచి సునీల్ గవాస్కర్ తప్ప మరెవరూ హాజరవకపోవటం గమనార్హం.