శ్రీలంక క్రికెటర్లకు పాకిస్థాన్‌లో ఆశించిన స్థాయిలో భద్రత కల్పించడంలో... ఆ దేశ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ ఆరోపించాడు.
అధ్యక్ష స్థాయి భద్రత కల్పిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పిన మాటలను లంకతో పాటు తాము కూడా సంతృప్తి చెందామనీ... కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేకపోయామని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని ఆయన వాపోయాడు.
ఏఫ్రిల్ 17వ తేదీన దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ సంఘటనపై ఇరు జట్ల ప్రతినిధుల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకుంటామని మోర్గాన్ వివరించారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భద్రతా బాధ్యత ఆతిథ్య దేశాలదేననీ, ఇందులో ఐసీసీని తప్పుబట్టేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే... ఈ దాడి వల్ల తమ దేశ క్రికెట్ భవిత ప్రశ్నార్థకంగా మారిందని పాక్ క్రికెటర్లు ఆందోళనపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... విదేశాలలోనూ, తటస్థ వేదికలలోనూ పాక్ క్రికెట్ ఆడేందుకు తమ సహకారం అందజేస్తామని మోర్గాన్ అంటున్నాడు. మోర్గాన్ చెప్పిన ఈ సమాధానం పాక్ క్రికెటర్లలో కాస్తంతైనా ఊరటను కలిగిస్తుందని ఆశిద్దాం..!