ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ వెలుగు వెలిగిన ఆస్ట్రేలియా జట్టుకు క్రేజ్ తగ్గిపోయిందని, మైదానంలో ప్రత్యర్థి జట్టుపై ధీటుగా రాణించే సీన్ ఆసీస్‌కు లేదని పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. గత మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు మంచి ఫామ్‌లో ఉన్నదని, కానీ ప్రస్తుతం ఆసీస్‌ను సులభంగా ఓడించవచ్చునని అక్తర్ అన్నాడు.
యూఎఈలో జరుగున్న వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు ఆసీస్‌పై ఆధిక్యం చెలాయిస్తుందని, మైదానంలో పాక్ గట్టిపోటీని ప్రదర్శించగలదని అక్తర్ నమ్మకం వ్యక్తం చేశాడు. తప్పకుండా యూఎఈ వన్డే సిరీస్‌లో ఆసీస్‌పై పాక్ విజయం సాధిస్తుందని అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో కంగారూలు కంగుతిన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసిన అక్తర్, ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. యూఏఈ వన్డే సిరీస్‌కు తాను ఎంపిక కావడం ఆనందంగా ఉందని, తన జట్టు తరపున ఆడేందుకు తనకు సదవకాశం లభించిందని అక్తర్ తెలిపాడు. అందుచేత ఈ వన్డే సిరీస్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు తీవ్రంగా కృషిచేస్తానని అతడు వెల్లడించాడు.