అయేషా సిద్ధికీ ఎవరో నాకు తెలియదు: అజారుద్దీన్
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మొదిటి భార్యనని చెప్పుకుంటున్న అయేషా సిద్ధికీ ఎవరనేది తనకు తెలియదని భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. షోయబ్-అయేషాల వివాహానికి మధ్యవర్తిత్వం వహించాననే వార్తలను అజారుద్ధీన్ ఖండించారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో తనను లాగొద్దని అజారుద్ధీన్ స్పష్టం చేశారు. షోయబ్ మాలిక్‌ను వివాహమాడటం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యక్తిగత విషయమని అజారుద్ధీన్ అన్నారు.ఇదిలా ఉంటే.. షోయబ్ తనను మోసం చేశాడంటూ అయేషా పోలీసులకు ఫిర్యాదు చేయడం, అయేషా ఫిర్యాదు మేరకు షోయబ్ అక్తర్ వద్ద పోలీసులు విచారణ జరిపారు. అనంతరం అయేషా సహా ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీన తమ వివాహం జరగడం ఖాయమని షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు మీడియాతో ప్రకటించారు. అయేషా కేసుకు సంబంధించిన నిజా నిజాలను కోర్టు, పోలీసులు చూసుకుంటారని, తనకు సానియాతో ఈ నెల 15వ తేదీన వివాహం జరిగితీరుతుందని షోయబ్ ధీమా వ్యక్తం చేశాడు.పెళ్లి కోసమే భారత్‌కు వచ్చానని, అయేషా ఫిర్యాదుపై పోలీసుల విచారణకు, భారత ప్రభుత్వ తదితర చర్యలకు పూర్తిగా సహకరిస్తానని మాలిక్ అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ దేశం వదిలి వెళ్లనని చెప్పాడు. అయేషా తన వయస్సు తెలిసిపోతుందనే ఉద్దేశంతో దాక్కుంటుందని, ఆమె ఎందుకు మీడియా ముందుకు రావడం లేదని మాలిక్ ఈ సందర్భంగా ప్రశ్నించాడు. మొత్తానికి ఎలాంటి అడ్డంకులు ఎదురైన సానియాతో తన పెళ్లి జరిగి తీరుతుందని, వాయిదా పడే ప్రసక్తే లేదని షోయబ్ తెలిపాడు.