Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొన్న వెస్టిండీస్.. నేడు జింబాబ్వే... మేటి జట్ల ఆశలను చిదిమేసిన అనామక జట్టు

Zimbabwe
, బుధవారం, 5 జులై 2023 (11:40 IST)
Zimbabwe
ఐసీసీ ప్రపంచ కప్ అర్హత పోటీల్లో ఒక అనామక జట్టు రెండు మేటి క్రికెట్ జట్ల ఆశలను చిదిమేసింది. ఆ జట్టు పేరు స్కాట్లాండ్. మొన్నటికిమొన్న వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించకుండా ఇంటికి పంపించింది. తాజాగా జింబాబ్వే జట్టును ఓడించి ప్రపంచ కప్‌ పోటీలకు దూరం చేసింది. దీంతో జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ పోటీలకు దూరమైంది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో జింబాబ్వే జట్టు ఆటగాళ్లు కన్నీటిపర్యంతమయ్యారు. అదేసమయంలో క్రికెట్ పసికూన స్కాంట్లాండ్‌కు ప్రపంచ కప్ ప్రవేశం లాంఛనంగా మారనుంది. 
 
జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ తర్వాత 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
తొలుత విజయం దిశగా పయనించిన ఆ జట్టు ఆతర్వాత వరుసపెట్టి వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమి పాలైంది. ర్యాన్ బురి (83), వెస్లీ మద్వీర్ (40)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టడంతో విజయం దూరమైంది. ఫలితంగా జింబాబ్వే జట్టు ఆశలు నీరుగారిపోయాయి. 
 
ఇకపోతే ఇపుడు రేసులో మిగిలింది స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు మాత్రమే. శ్రీలంక ఇప్పటికే ప్రపంచ కప్‌లో బెర్తును ఖరారు చేసుంది. గురువారం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య తుది పోరు జరుగనుంది. ఇందులో స్కాట్లాండ్ నెగ్గితే ప్రపంచ కప్ పోటీల్లో చోటు ఖరారవుతుంది. స్కాంట్లాండ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో నెదర్లాండ్ జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సివుంది. లేదంటే ఆ జట్టు గెలిచినా ప్రయోజనం శూన్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ చీఫ్ సెలెక్టరుగా అజిత్ అగార్కర్