ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించకనుంది. ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు మెన్ అండ్ బ్లూ రంగుల్లో కనిపించారు. కానీ, ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు దుస్తుల్లో కనిపించనున్నారు.
నిజానికి భారత క్రికెట్ జట్టు ధరించే దుస్తులను మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది.ఈ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. వివాదాలు, అంచనాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సేన ధరించే జెర్సీని బీసీసీఐ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
అందరూ అనుకున్నట్లుగానే నారింజ, నీలి రంగు కాంబినేషన్‌లో కొత్త డ్రెస్ అదిరిపోయేలా కనిపిస్తోంది. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ అత్యుత్తమ శ్రేణిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా డ్రెస్‌ను డిజైన్ చేశారు. ఈ జెర్సీలు తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా తయారు చేయించారు.
ఫిఫా టోర్నీల తరహాలో గతానికి భిన్నంగా ఐసీసీ ఈసారి రెండు జెర్సీల ఫార్మాట్‌ను తీసుకొచ్చింది. దీనిప్రకారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు వేర్వేరు రంగుల్లో జెర్సీలను(హోమ్ అండ్ అవే) ఎంచుకోవాల్సి ఉంటుంది. జెర్సీలు దాదాపు ఒకే రంగులో ఉండటం వలన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త అవతారంలో బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీ వేసుకున్న కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. వరల్డ్‌కప్ ట్విట్టర్‌లో ఆ ప్లేయర్ల ఫోటోలను పోస్టు చేశారు. ఆరెంజ్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు.