మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది లీగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలను బీసీసీఐ పటాపంచలు చేసింది. నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. చాలెంజర్ సిరీస్ పేరిట ఈ టోర్నీ జరుగనుంది.
మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ షెడ్యూల్ మధ్యలో చాలెంజర్ సిరీస్‌ను జరుపుతాం. అలాగే కరోనా వైరస్ కారణంగా జాతీయ క్రికెట్ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్ కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తామని సౌరవ్ గంగూలీ చెప్పారు.
యూఏఈలో మహిళల ఐపీఎల్‌నూ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్ కోసం మా సన్నాహం ఎట్టకేలకు ఆరంభం కానుంది. బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జై షాలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ కూడా బీసీసీఐ బాస్ గంగూలీ, బీసీసీఐలకు కృతజ్ఞతలు తెలిపారు.