Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంగారుల చేతిలో భారత్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి?

india vs aus
, ఆదివారం, 19 నవంబరు 2023 (22:24 IST)
స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి విశ్వవిజేతగా నిలించింది. ఆదివారం అహ్మదాబాద్‍‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఓడిపోయారు. తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చేతులెత్తేశారు. లీగ్ మ్యాచ్ నుంచి సెమీస్ వరకు అద్భుతంగా రాణించడమే కాకుండా, భారత బ్యాటర్లు పోటీపడుతూ పరుగులు చేశారు. బౌలర్లు కూడా పోటీపడి వికెట్లు పడగొట్టారు. కానీ ఆఖరి పోరాటంలో మాత్రం అందరూ సమిష్టిగా చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలను పరిశీలిస్తే, 
 
సొంతగడ్డపై అందీ సొంత ప్రేక్షకుల సమక్షంలో భారత్ ఆఖరి మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. దీనికి కారణం బ్యాటర్లు సరైన ప్రదర్శన కనబర్చకపోవడం. రోహిత్ శర్మ ఆటతీరు అగ్రెసివ్ అయినప్పటికీ.. ఇలాంటి కీలక మ్యాచ్లో మాత్రం ఆచితూచి ఆడాలన్న బాధ్యతను విస్మరించారు. అసలే పిచ్ బ్యాటింగ్‌కి ఏమాత్రం అనుకూలించదని ముందు నుంచే చెప్తున్నారు. అయినప్పటికీ రోహిత్ ఇంకాసేపు క్రీజులో ఉండేలా జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేది. మరో ఓపెనర్ శుభమన్ గిల్ అయితే అనవసరమైన షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ఉన్నంతలో ఫర్వాలేదనిపించాడు. అయితే, అతను ఊహించని విధంగా ఔట్ అయ్యాడు. ఇక వరుసగా రెండు సెంచరీలు చేసిన శ్రేయస్ అయ్యార్.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
లీగ్ దశలో అంత బాగా ఆడిన ఈ ప్లేయర్, కీలక మ్యాచ్‌లో కేవలం 4 పరుగులకే ఔటై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక కేఎల్ రాహుల్ అయితే.. టెస్టు తరహాలో ఇన్నింగ్స్ ఆడాడు. అతినికి వేరే మార్గం లేదు. వికెట్లు లేనప్పుడు ఆచితూచి ఆడి తన బాధ్యతను నెరవేర్చాడు. కానీ, ఇలాంటి కీలక మ్యాచ్‌లలో 107 బంతుల్లో 66 పరుగులు చేయడం ఏమాత్రం సబబు కాదు. ఇక జడేజా, సూర్యకుమార్ అయితే పూర్తిగా చేతులెత్తేశారు. ఈ టోర్నీలో వీళ్లు ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్, రాహుల్ ఫర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు జెండా ఎత్తేయడం ఈ ఓటమికి కారణం.
 
అలాగే, బౌలింగ్ విభాగానికి వస్తే, పేలవమైన బౌలింగ్ ప్రదర్శన. సెమీ ఫైనల్ దాకా ఎగబడి మరీ వికెట్లు తీసిన మన భారత బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఆరంభంలో బుమ్రా (2), షమీ (1) కలిసి మూడు వికెట్లు తీసి మంచి జోష్ తీసుకొచ్చారు. దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్‌ల భాగస్వామ్యాన్ని ఏమాత్రం బ్రేక్ చేయలేకపోయారు. కఠినమైన పిచ్లలోనూ మెరుగైన ఆటతీరు ఎలా కనబర్చాలో.. వీళ్లిద్దరు చాటి చెప్పారు. మన బ్యాటర్లు పరుగులు చేసేందుకు తడబడితే.. వీళ్లిద్దరు మాత్రం పరుగుల వర్షం కురిపించి, తమ జట్టుని సునాయాసంగా గెలిపించుకున్నారు. దటీస్ ఆస్ట్రేలియా క్రికెటర్లు. ప్రొఫెషనలిజానికి పెట్టింది పేరు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఖరి మెట్టుపై బోర్లాపడిన భారత్... కప్ చేజారింది.. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా