క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత పరుగుల వేటలో ముందుండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే అందరికీ అభిమానమే. కానీ కోహ్లీ అంటే ఇష్టపడమని ఆసీస్ కెప్టెన్ అంటున్నాడు. కోహ్లీని ఓ క్రికెట్ అభిమానిగా కోహ్లీ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తామని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌పైన్ అన్నాడు.
ఇంకా టిమ్‌పైన్ మాట్లాడుతూ.. ''కోహ్లీ గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. అయితే, నా దృష్టిలో అందరిలాగే అతడూ ఒక ఆటగాడు మాత్రమే. తన విషయంలో నేనేం కంగారు పడను. నిజం చెప్పాలంటే కోహ్లీతో మాకు అంత బలమైన బంధం లేదు.
టాస్ వేసేటప్పుడు మాత్రమే అతడిని చూస్తాను. తర్వాత కలిసి ఆడతాం. అంతకుమించి ఇంకేం ఉండదు. అతడిని మేం ఇష్టపడం కానీ, ఒక క్రికెట్ అభిమానిగా మాత్రం అతడు ఆడుతుంటే చూడాలనుకుంటాం. అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించినా ఎక్కువ పరుగులు సాధించడం నచ్చదు. మా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు.