Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ!

ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ!
, సోమవారం, 28 డిశెంబరు 2020 (21:17 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల, మహిళల క్రికెట్ రంగాల్లో ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద కోహ్లీకి సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందివ్వనున్నారు. 
 
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్న కాలంలో కోహ్లీ మొత్తం 20,396 పరుగులు సాధించాడు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో 66 సెంచరీలు, 94 అర్థసెంచరీలు నమోదు చేశాడు. మరే క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో సూపర్ ఫామ్ కొనసాగించాడు. కాగా, కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.
 
ఇకపోతే, భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు లభించింది. 2011లో నాటింగ్ హామ్‌లో ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్టులో ఇంగ్లీష్ ఆటగాడు ఇయాన్ బెల్‌ను మొదట రనౌట్‌గా ప్రకటించారు. అప్పటికి బెల్ 137 పరుగులు చేశాడు. బెల్ ఓ బంతికి షాట్ ఆడగా అది బౌండరీ వద్దకు వెళ్లింది. అయితే ఫీల్డర్ అభినవ్ ముకుంద్ బంతిని త్రో చేయగా, బెల్ రనౌటయ్యాడు.
 
వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే... బెల్ షాట్ ఆడగా బంతి బౌండరీ లైన్ తాకింది. ఈ విషయం గమనించని ముకుంద్ త్రో చేయగా, బెల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న అప్పటి కెప్టెన్ ధోనీ ఎంతో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇయాన్ బెల్‌ను మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ ఘటన క్రికెట్ స్ఫూర్తికి అద్దంపట్టేలా నిలిచింది. నాటి ఆ సుహృద్భావ చర్యతో ఇవాళ ధోనీ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు.
 
అదేవిధంగా ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20 ఆటగాడిగా రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) ఎంపికయ్యారు. మహిళల క్రికెట్లో ఈ దశాబ్దపు అత్యుత్త మహిళా క్రికెటర్‌గా ఆసీస్ ఆల్ రౌండర్ ఎలిస్సే పెర్రీ అవార్డు కైవసం చేసుకుంది.
 
మరోవైపు, ఆదివారం దశాబ్దకాలంలో అంటే గత పదేళ్ళ కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన విషయం తెల్సిందే. దశాబ్దపు పురుషుల, మహిళల టీ20, వన్డే జట్లను ఐసీసీ ఆదివారం ప్రకటించింది.
 
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మాజీ సారథి, వరల్డ్‌కప్‌ల విన్నింగ్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20, వన్డే జట్లకు నాయకుడిగా ఎంపికయ్యాడు. భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, బుమ్రా, విరాట్‌ కోహ్లీ జట్టులో చోటుదక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌, టీ20 లెజెండ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ వంటి ఆరుగురు హిట్టర్లు ఇందులో ఉన్నారు. దశాబ్దపు పురుషుల టెస్టు టీమ్‌ కెప్టెన్‌గా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.
 
అలాగే, ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకోగా, విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా స్థానం దక్కించుకున్నారు. వీరేకాకుండా, సఫారీ విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) జట్టులోని ఇతర సభ్యులు.
 
అదేవిధంగా ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఈ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా స్థానం దక్కింది. ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.
 
టెస్టు టీమ్‌: అలిస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, సంగక్కర(వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, అశ్విన్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.
 
టీ20 టీమ్‌: రోహిత్‌ శర్మ, క్రిస్‌గేల్‌, అరోన్ ఫించ్‌, విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ధోనీ, పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌, బుమ్రా, మలింగ.
 
వన్డే టీమ్‌: రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, కోహ్లీ, డివిలియర్స్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ధోనీ(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), బెన్‌స్టోక్స్, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, మలింగ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెల్‌బోర్న్ టెస్ట్ : కంగారెత్తించిన భారత బౌలర్లు .. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్