ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ తేరుకోలేని కౌంటర్ ఇచ్చారు. తన వద్ద సాండ్ పేపర్ లేదంటూ సమాధానమిచ్చారు. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లి తన జేబులో చేతులు పెట్టి 'నా దగ్గర ఏమీ లేదు. చూసుకోండి' అన్నట్లు సైగలు చేశాడు.
సాధారణంగా మైదానంలో విరాట్ కోహ్లీ ఎంతో చురుగ్గా ఉంటారు. అతడిని లేదా జట్టును ఎవరైనా టార్గెట్ చేస్తే గట్టిగా కౌంటర్ ఇస్తాడు. అది బౌలర్లా.. ప్రేక్షకులా? అనేది పట్టించుకోడు. ఆస్ట్రేలియా పర్యటనలో అందరి చూపు విరాట్ కోహ్లీమీదే ఉంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్ అభిమానులు కోహ్లీని ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక్కడా కోహ్లీతోపాటు భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ ఆసీస్ అభిమానులు రెచ్చిపోయారు. అయితే, మరోసారి విరాట్ వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే?
సిడ్నీ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. అతడు రెండో రోజు చివరి సెషన్‌లో గాయం కారణంగా డగౌట్‌కు వెళ్లిపోయాడు. అంతకుముందు అతడి షూస్‌లో సాండ్ పేపర్ ఉందంటూ పలు వీడియోలను ఆసీస్ ఫ్యాన్స్ షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలంటూ కామెంట్లూ చేశారు.
ఇవాళ బుమ్రా బౌలింగ్‌కు రాలేదు. అతడికి బదులు విరాట్ జట్టును నడిపిస్తున్నాడు. అయినా సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లి తన జేబులో చేతులు పెట్టి 'నా దగ్గర ఏమీ లేదు. చూసుకోండి' అన్నట్లు సైగలు చేశాడు.
స్మిత్ సాండ్ పేపర్ స్కాం వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బుమ్రాపై వస్తున్న ట్రోల్స్‌కు కౌంటర్ విరాట్ స్పందించడం భారత అభిమానులను ఆకట్టుకుంది. తమ జట్టు ఆటగాళ్లు ఆసీస్‌లో మోసం చేయరంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.