Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది: కోహ్లీ చికాకు

నేను భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ అదే విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ విషయం నాకు అస్సలు అర్థం కాదు అంటూ భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసహనం ప్రదర్శించాడు. జూన్‌ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత

భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది: కోహ్లీ చికాకు
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (08:15 IST)
నేను భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ అదే విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ విషయం నాకు అస్సలు అర్థం కాదు అంటూ భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  అసహనం ప్రదర్శించాడు. జూన్‌ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత బృందం బుధవారం ఇంగ్లండ్‌కు పయనమైన నేపథ్యంలో జట్టు విజయావకాశాలపై కోహ్లి మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. నాకు సంబంధించి నేను ఏదో సాధించి చూపాలనేదాన్ని నమ్మను. ప్రపంచంలో ఏ మూలన ఆడినా భారత జట్టును గెలిపించడమే ఏకైక  లక్ష్యం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.
 
విరాట్‌ కోహ్లి అద్భుత కెరీర్‌లో 2014 ఇంగ్లండ్‌ పర్యటన ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ టూర్‌ మొత్తం అతను ఘోరమైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత కోహ్లి ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌కు వెళుతున్నాడు. నాటి గాయాలు మానే విధంగా లెక్క సరి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు విరాట్‌ ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు కానీ చుట్టూ ఉన్న వాతావరణం మా ప్రదర్శనను జీవన్మరణ సమస్యగా మార్చేస్తుంది. ముఖ్యంగా ఉపఖండపు క్రికెటర్లకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అంటూ విచారం వ్యక్తం చేశాడు. 
 
పాకిస్తాన్‌పై మ్యాచ్‌ను ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. బంతిని ఎదుర్కొనేటప్పుడు ఎదుట ఉన్న నాన్‌స్ట్రైకర్‌ గురించే ఆలోచన రాదు. అలాంటప్పుడు మన అదుపులో లేని, మైదానం బయట జరిగే విషయాల గురించి ఏమని ఆలోచించగలం. క్రికెటర్లుగా మాకు ఇష్టమైన ఆట ఆడటమే మా పని. భారత్, పాక్‌ మ్యాచ్‌పై అంచనాలు, ఉత్కంఠ ఎప్పుడూ ఉండేవే. అభిమానులకు అది చాలా కీలకమైనది కావచ్చు. కానీ మా దృష్టిలో అన్ని మ్యాచ్‌లలాంటిదే. మేమేమీ మొదటిసారి తలపడటం లేదు.  ప్రత్యర్థి విషయంలో మా ఆలోచనలు, సన్నాహాల విషయంలో తేడా ఉండదు. అది ఏ జట్టయినా ఒకటే. ప్రత్యేకంగా ఈ మ్యాచ్‌ కోసం స్ఫూర్తి పొందాల్సిన అవసరం కూడా లేదు. గెలవాలనే తపన ఉంటే సరిపోతుంది తప్ప మరీ ఉద్వేగపడిపోకూడదు అన్నాడు కోహ్లీ.
 
ధోని, యువరాజ్‌ ఇద్దరూ జట్టుకు మూలస్థంభాల్లాంటివారు. ధోని, యువీల అనుభవాన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోగలను. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి, మ్యాచ్‌ ఎలా గెలవాలి, కష్టాల్లో జట్టును ఎలా ఆదుకోవాలో వారికి బాగా తెలుసు. మిడిలార్డర్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ వారు స్వేచ్ఛగా ఆడగలరు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అది కనిపించింది. వారి ఆలోచనా ధోరణి జట్టుకు మేలు చేస్తుంది అన్నాడు కోహ్లీ.వన్డే వరల్డ్‌ కప్‌తో పోలిస్తే చాంపియన్స్‌ ట్రోఫీలోనే పోటీ తీవ్రంగా ఉంటుందని డిఫెండింగ్‌ చాంపియన్‌ అనే ముద్రతో ఒత్తిడి పెంచుకోకుండా ఆడి విజయం సాధిస్తామని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను భారత క్రికెటర్‌ను కాదు.. నాకు నా దేశం ముఖ్యం : ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్