Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెర్త్ టెస్ట్ : కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఔట్

Advertiesment
Virat Kohli
, ఆదివారం, 16 డిశెంబరు 2018 (11:14 IST)
ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాను 326 పరుగులకే కట్టడి చేసిన భారత్… 172/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే రహానే వికెట్ కోల్పోయాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్  లయన్ అద్భుత బంతితో రహానేను బోల్తా కొట్టించాడు. 105 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో రహానే (51) రన్స్ చేశాడు.
 
క్రీజులోకి వచ్చిన విహారితో కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగించాడు. దీంతో తన టెస్టు కెరీర్‌లో 25వ సెంచరీని కోహ్లీ పూర్తి చేశాడు. 214 బంతుల్లో 11 ఫోర్లతో కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో వేగంగా 25 సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 
 
అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నాడు. 76 మ్యాచ్‌లు.. 128 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. 81 ఓవర్లలో భార‌త స్కోరు 4 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు. కోహ్లీ తర్వాత సచిన్ 130 ఇన్నింగ్స్‌లో.. గవాస్కర్ 138 ఇన్నింగ్స్‌లో 25 సెంచరీలు పూర్తి చేసిన వారిలో ఉన్నారు. అంతర్జాతీయంగా బ్రాడ్‌మన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 52 మ్యాచ్‌లు.. 68 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.
 
అయితే, అపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఔట్ అయ్యాడు. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 93వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ (123) క్యాచ్ అవుట్ అయ్యాడు. కమిన్స్‌ వేసిన బంతిని ఆఫ్ సైడ్ దిశగా కోహ్లి షాట్ ఆడగా.. అదికాస్తా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని సెకండ్‌  స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్‌ చేతిలో పడింది. అయితే బంతి నేలకు తాకినట్లుగా అనుమానం ఉండటంతో ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌కు రెఫర్ చేశారు. బంతి నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్‌ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో 'బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్'గా బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా ఇవ్వాల్సిందిపోయి.. థర్డ్‌ అంపైర్‌ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంను స్టేడియంలోని టీవీలో చూసిన కోహ్లీ అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌కు వెళ్ళాడు. 
 
అనంతరం స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే మొహమ్మద్ షమీ (0) కూడా క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
లంచ్ అనంతరం ఇషాంత్ కూడా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 100 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కీపర్ రిషబ్ పంత్ (19), ఉమేష్ (2) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 66 పరుగులు వెనుకబడి ఉంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా తప్పక ప్రపంచ కప్‌ను గెలుచుకుంటుంది.. గంగూలీ