Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుండె పగిలి కోచ్ పదవికి రాజీనామా చేసిన కుంబ్లే.. అకుంఠిత దీక్షకు ఘోరావమానం

దాదాపు 18 సంవత్సరాలపాటు నిరుపమానమైన అంకితభావంతో భారత క్రికెట్ కీలకబౌలర్‌గా అపార సేవలందించిన అనిల్ కుంబ్లేకు ఘోరావమానం జరిగింది. కోచ్ కుంబ్లేతో కలిసి ముందుకు వెళ్లలేనంటూ కెప్టెన్ కోహ్లీ కుండబద్దలు కొట్

Advertiesment
Indian cricket team
హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (03:02 IST)
దాదాపు 18 సంవత్సరాలపాటు నిరుపమానమైన అంకితభావంతో భారత క్రికెట్ కీలకబౌలర్‌గా అపార సేవలందించిన అనిల్ కుంబ్లేకు ఘోరావమానం జరిగింది. కోచ్ కుంబ్లేతో కలిసి ముందుకు వెళ్లలేనంటూ కెప్టెన్ కోహ్లీ కుండబద్దలు కొట్టిన మూడురోజులకు అనివార్య పరిణామం చోటు చేసుకుంది. తనను కాదనుకునే వారితో తానూ కొనసాగలేనంటూ కుంబ్లే కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నారు. తన కాంట్రాక్ట్‌ ముగియడంతో రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సమాచారమిచ్చారు. కుంబ్లేను కొనసాగించాలంటూ సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లు సిఫారసు చేసినా తన వల్ల కాదంటూ అనిల్‌ కుంబ్లే తప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  
 
భారత జట్టు హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ప్రకారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న మంగళవారం రోజే కుంబ్లే తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుంబ్లే ఇష్టపడితేనే విండీస్‌ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. నిజంగానే కుంబ్లే కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో కోచ్‌ లేకుండా టీమిండియా విండీస్‌ పయనమైంది. ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే, ఈ నెల 23 వరకు సాగే ఆ సమావేశాల్లో పాల్గొనేందుకే విండీస్‌ వెళ్లడం లేదని మొదట్లో భావించినా... అది అసలు కారణం కాదని ఇప్పుడు అర్థమైంది. కుంబ్లే రాజీనామాను నిర్ధారించిన బీసీసీఐ, విండీస్‌ పర్యటనలో జట్టును పర్యవేక్షించేందుకు మేనేజర్‌గా హైదరాబాద్‌ మాజీ రంజీ క్రికెటర్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ జట్టుతో పాటు ఉంటారు.
 
భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీకి బయల్దేరే ముందే కోచ్, కెప్టెన్‌ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కుంబ్లే ‘శైలి’ శిక్షణ తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని జట్టులో కొందరు ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. కనీసం పది మంది కుంబ్లేకు వ్యతిరేకంగా ఉన్నట్లు వినిపించింది. దీనిని బీసీసీఐ పెద్దలతో పాటు కోహ్లి కూడా ఖండించాడు. సరిగ్గా టోర్నీకి ముందు కొత్త కోచ్‌ కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించడం కూడా అనుమానాలు రేకెత్తించింది.  అయితే టోర్నీ మొదలయ్యాక అందరి దృష్టి ఆటపైనే నిలిచింది. ప్రాక్టీస్‌ సెషన్ల సమయంలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకున్నా ఫోకస్‌ అంతా సన్నద్ధతపైనే సాగింది. అయితే టోర్నీ ముగిశాక మరోసారి ముందుకొచ్చిన ఈ అంశం కుంబ్లే నిష్క్రమణ దాకా సాగింది.
 
శనివారం కోహ్లితో సమావేశమైన సలహా కమిటీ సభ్యులు, బోర్డు అధికారులు సోమవారం కుంబ్లేతో కూడా మాట్లాడారు. ఈ భేటీలో కుంబ్లే ఆసాంతం ‘నాకు, కోహ్లికి మధ్య ఎలాంటి సమస్యా లేదు’ అనే చెబుతూ వచ్చారు. అయితే కోహ్లి తమతో చెప్పిన విషయాలన్నీ కుంబ్లే ముందు ఏకరువు పెట్టడంతో కథ మారిపోయింది. అంతా విన్న తాను ఇక కొనసాగలేనంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త కోచ్‌ వేటలో అందరి దృష్టి మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌పై నిలిచింది. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, కోచ్‌గా అతను ఏ మాత్రం పనికొస్తాడో చెప్పలేం. 
 
బీసీసీఐ చరిత్రలో ఏ కోచ్‌కూ జరగని అవమానం కుంబ్లేకి జరిగింది. ఆటగాడు ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే క్రమశిక్షణ అందరి విషయంలో సమానంగానే ఉండాలని చెప్పిన కుంబ్లేకు, తమదైన స్వేచ్చను ఇష్టం వచ్చినట్లుగా పొందాలని చూస్తున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు మధ్య జరిగిన అంతర్యుద్ధంలో కోచ్ ఓడిపోయాడు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని నిరూపిస్తూ కెప్టెన్, కోచ్‌ కలహాల కాపురం ఏడాది కాలానికే ముగియడం బాధాకరం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ, యువరాజ్‌ల పని ముగిసినట్లేనా.. ద్రావిడ్ ఊరకే అంతమాట అనడు కదా