Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ చెప్పిందని.. ప్రియాంకతో పెళ్లయ్యాక.. ఐపీఎల్‌కు నేను.. హాలండ్‌కు..?

Advertiesment
Indian cricketer Suresh Raina
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (14:15 IST)
అమ్మ మాటను జవదాటని కుమారుడిగా సురేష్ రైనా నడుచుకుంటున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  కానీ రైనా ప్రియాంకతో గతంలో పెద్దగా మాట్లాడట్లేదట. తన వివాహం గురించి రైనా చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే తెలుసుకుందాం... ‘ఘజియాబాద్‌లో నా చిన్నప్పుడు ప్రియాంక వాళ్ల నాన్న మా స్పోర్ట్స్ టీచర్. వాళ్ల అమ్మ, మా అమ్మ స్నేహితులు. ఆ అమ్మాయితో నాకు పెద్దగా పరిచయం లేదు. 2008లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తనని చూశాను. తను హాలండ్ వెళుతోంది. నేను ఐపీఎల్ మ్యాచ్ కోసం బెంగళూరు వెళుతున్నాను. ఎయిర్‌పోర్ట్‌లో చూడగానే ఒకరిని ఒకరం గుర్తు పట్టాం.
 
ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాం. మళ్లీ ఆ తర్వాత ప్రియాంకను కలవలేదు. మాట్లాడలేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమయంలో ఒక రోజు మా అమ్మ ఫోన్ చేసింది. ‘నీ పెళ్లి కుదిర్చాను’ అంది. నేను ‘ఎవరితో’ అని అడిగాను. అప్పుడు ప్రియాంక గురించి చెప్పింది. ‘నువ్వు ఏం చేసినా నా మంచికే. అయితే ఒకసారి ఆ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడతా’ అని అమ్మను అడిగి ఫోన్‌లో ప్రియాంకతో మాట్లాడాను. ప్రపంచకప్‌కు ముందు జట్టు సహచరుల్లో కొందరికి పెళ్లి విషయం చెప్పాను. నేను వచ్చేలోపే నా కుటుంబసభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
విదేశాల్లోని నా స్నేహితులు, జట్టు సహచరులకు సౌకర్యంగా ఉండాలని ఢిల్లీలో పెళ్లి చేసుకుంటున్నాను. భారత్ వచ్చాక కూడా నేను ప్రియాంకను అరగంట మాత్రమే కలిసి మాట్లాడాను. పెళ్లి కాగానే నేను ఐపీఎల్‌లో బిజీ అయిపోతాను. తనకు కూడా కెరీర్ చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే హాలండ్ వెళ్లిపోతుంది. ఐపీఎల్ ముగిశాక ఇటలీలోని మిలాన్‌లో హనీమూన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రియాంకకు క్రికెట్ గురించి తెలియదు. తనకు ఫుట్‌బాల్ అంటే పిచ్చి. మెస్సీ, వాన్‌పెర్సీలకు పెద్ద ఫ్యాన్. నన్ను క్రికెటర్‌గా కాకుండా, ఓ వ్యక్తిగా తను ఇష్టపడినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటున్నాను.’ అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఇంకేముంది.. సురేష్ రైనా.. అమ్మ మాట జవదాటని సుపుత్రుడే కదా..!

Share this Story:

Follow Webdunia telugu