2013నాటి బూటు కేసు నుంచి ధోనీకి ఊరట.. కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు
2013నాటి బూటు కేసు నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట లభించింది. ధోనీ విష్ణుమూర్తి అవతారంలో కనబడుతూ ఓ చేతిలో చెప్పుతో దర్శనమివ్వడం వివాదానికి దారితీసింది. 'బిజినెస్ టుడే' పత్రిక ప్
2013నాటి బూటు కేసు నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట లభించింది. ధోనీ విష్ణుమూర్తి అవతారంలో కనబడుతూ ఓ చేతిలో చెప్పుతో దర్శనమివ్వడం వివాదానికి దారితీసింది. 'బిజినెస్ టుడే' పత్రిక ప్రధానపేజీ ముఖ చిత్రంగా ధోనిని హిందూ దేవుడు విష్ణుమూర్తి రూపంలో చిత్రించడం సంచలనానికి తెరతీసింది.
'గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్' పేరుతో బిజినెస్ టుడే ఓ కథనం ప్రచురించింది. ఈ పత్రిక ధోనీ ప్రచారం చేస్తున్న ఉత్పత్తులతో ఆయన్ని విష్ణుమూర్తిగా చిత్రీకరించింది. కానీ ఒక చేతితో షూ పట్టుకోవడంపై హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. తమ దేవుడి ఆకారంలో ధోనీని చూపడమే కాకుండా బూట్లు పట్టుకున్నట్లు చిత్రించడంతో తమ మనోభావాలను కించపరిచేలా ఉందని వారు మండిపడుతున్నారు.
వాణిజ్య ప్రకటన విషయంలో ధోని స్టార్లందరినీ వెనక్కినెట్టి నెం.1 స్థానంలో ఉన్నాడని చెప్పడం కోసం ధోనీని ఇలా విష్ణుమూర్తిగా చిత్రీకరించారు. వివిధ ఉత్పత్తులతో పాటు రిబాక్ బూట్ల కంపెనీకి కూడా ధోని ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై అనంతపురం జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలైంది. బెంగళూరు కోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
అయితే, ఈ ఫొటో వివాదంలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదని, అందువల్ల కేసును కొట్టివేయాలంటూ ధోనీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు... ధోనీ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని అభిప్రాయపడింది. కేసును కొట్టి వేసింది. దీంతో, ధోనీకి ఉపశమనం లభించినట్టైంది.