2011 Cricket World Cup Final
టీమిండియా విజేతగా నిలిచిన 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను శ్రీలంక అమ్ముకుందని ఆ దేశ మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ మహిదానందా అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశారు. తాము గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకున్నామని, దీని వెనుక కొన్ని శక్తులు కుట్ర చేశాయని అల్తుగమాగే విమర్శించారు.
''2011 వరల్డ్‌కప్ ఫైనల్‌ను మేం అమ్ముకున్నాం. అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్‌గా నేనే ఉన్నా. 2011 ఫైనల్లో మేం కచ్చితంగా గెలిచేవాళ్లం. కానీ ఆ మ్యాచ్‌ను అమ్ముకున్నాం కాబట్టి ఓడాం. ఇన్నాళ్లూ దేశ సంక్షేమం దృష్ట్యా ఈ విషయాన్ని బయట పెట్టకూడదని అనుకున్నా. కానీ, ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. ఆ మ్యాచ్ ఫిక్స్ అయింది. దీనిపై చర్చకు కూడా నేను సిద్ధమే. ఈ మ్యాచ్‌పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయితే, ఫిక్సింగ్‌లో ప్లేయర్ల ప్రమేయం లేదు. కొన్ని గ్రూప్‌లు కచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యాయి'' అని అల్తుగమాగే వ్యాఖ్యానించారు.
2010 నుంచి 2015 వరకు లంక స్పోర్ట్స్ మినిస్టర్‌గా పని చేసిన అల్తుగమాగే.. ప్రస్తుతం పవర్, రెన్యువబుల్‌ఎనర్జీ మినిస్టర్‌గా ఉన్నారు. వాంఖడేలో జరిగిన ఆనాటి ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో లంకపై గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, మహిదానందా ఆరోపణలను 2011 వరల్డ్‌కప్ ఫైనల్ సెంచరీ హీరో మహేల జయవర్దనే కొట్టి పారేశాడు.
త్వరలో జరిగే ఎలక్షన్స్‌లో లబ్ది పొందేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాడు. ఎన్నికల ముంగిట ఇలా సర్కస్ స్టార్ట్ చేశారని ఎద్దేవా చేశాడు. ఫిక్స్ చేసిన వారి పేర్లు, అందుకు ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశాడు. ఆధారాలు చూపించాలని ఆ టోర్నీలో లంక కెప్టెన్ కుమార సంగక్కర కూడా కోరాడు. వాటిని ఐసీసీ, యాంటీ కరప్షన్ యూనిట్‌కు ఇస్తే లోతుగా దర్యాప్తు చేస్తుందని చెప్పాడు.