టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొన్నాయని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
వీటిపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. అవన్నీ అసత్యపు వార్తలని కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ-రోహిత్ శర్మ వివాదంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు.
క్రీడలు అత్యుత్తమైనవి అన్న ఆయన.. వ్యక్తుల కంటే ఆటే గొప్పది అని చెప్పుకొచ్చారు. ఆటకంటే ఎవరూ గొప్ప కాదు అని అన్నారు. దేశంలోని ఏ క్రీడలో ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందనే సమాచారం తాను ఇవ్వలేనని ఆయన చెప్పారు.
ఒక వేళ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏమైనా విబేధాలు ఉంటే అది బీసీసీఐ చూసుకుంటుందని అనురాగ్ చెప్పారు. కాగా అనురాగ్ ఠాకూర్ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ వివాదం నడుమే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ నెల 16న భారత జట్టు సౌతాఫ్రికా బయలుదేరుతుంది. అక్కడ ఈ నెల 26 నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.
అనంతరం మూడు వన్డేల సిరీస్ కూడా ఆడుతుంది. సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన అనంతరం కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారత జట్టు క్వారంటైన్‌లో ఉండనుంది.