భారత్ - దక్షిణాఫ్రికా సమరం : నేడు తొలి టీ-20 వామప్‌ మ్యాచ్‌

మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (09:48 IST)
భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సమరం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా భారత్ ఏ జట్టుతో సఫారీలు తొలి వామప్ మ్యాచ్‌ను మంగళవారం ఆడనున్నారు. ఈ పర్యటన రెండున్నర నెలల పాటు జరుగనుంది. ఇందులోభాగంగా యువకులు, అనుభవజ్ఞులతో పటిష్టంగా ఉన్న సఫారీ జట్టు మంగళవారం జరిగే టీ-20 వామప్‌ మ్యాచ్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌-ఎతో పోటీ పడనుంది. 
 
ఈ మ్యాచ్‌లో సత్తా చాటి 72 రోజుల పర్యటనను ఆశాజనకంగా ఆరంభించాలని సఫారీ జట్టు ఆశిస్తోంది. పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా.. మన్‌దీప్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తున్న యువ భారత్‌ను ఎదుర్కోనుంది. అక్టోబర్‌ 2న ధర్మశాల వేదికగా ధోనీసేనతో జరిగే తొలి టీ-20 నాటికి.. మ్యాచ్‌ మూడ్‌లోకి రావాలని సఫారీలు భావిస్తున్నారు. వామప్‌ మ్యాచ్‌ రూపంలో వారికిది ఓ మంచి అవకాశం. 
 
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమైన పాలమ్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌‌గ్రౌండ్‌ అంత పెద్దది కాకపోవడంతో డివిల్లీర్స్‌, డుప్లెసిస్‌, మిల్లర్‌ బ్యాట్ల నుంచి భారీషాట్లు జాలువారే అవకాశం కనిపిస్తోంది. ఇక పేస్‌బౌలర్ డేల్‌ స్టెయిన్‌, మోర్నె మోర్కెల్‌ లేకపోయినా.. టీ-20కి సరిపోయే బౌలింగ్‌ వనరులు ఆ జట్టుకున్నాయి. క్రిస్‌ మోరిస్‌, తాహిర్‌, కైల్‌ అబాట్‌.. పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా నిరూపించుకున్నవారే. ఐపీఎల్‌లో పాల్గొనడం.. వీరికి ప్లస్‌ పాయింట్‌.
 
సఫారీలకు ప్రత్యర్థులుగా బీసీసీఐ ప్రకటించిన జట్టు పేరుకు భారత్‌-ఎ అయినా.. ద్వితీయ శ్రేణి టీమ్‌లా కనిపించడం లేదు. అసలైన భారత్‌-ఎ ప్రస్తుతం బెంగళూరులో బంగ్లాదేశ్‌-ఎతో మూడు రోజుల మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ఐపీఎల్‌లోనూ రాణిస్తున్న సఫారీలను ఎదుర్కోవడం మన కుర్రాళ్లకు అంత సులభం కాబోదని చెప్పొచ్చు. మొత్తంమీద భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా సాగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి