తనకు భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా చేసే అవకాశం వస్తే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను రోజుకు 20 కిలోమీటర్ల దూరం పరుగెత్తిస్తానని ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ శరీరాకృతి, ఫిట్నెస్‌పై పలు రకాలైన కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
యోగరాజ్ తాజాగా ఫైండ్ ఏ వే అనే పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో భారత కోచ్‌గా అవకాశమిస్తే ఏం చేస్తారంటూ హోస్ట్ ప్రశ్నించారు. దీనికి యోగరాజ్ ఏమాత్రం తడుముకోకుండా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లను కాపాడుకుంటూ వారికి అండగా ఉంటానని చెప్పారు.
జాతీయ జట్టుకు కోచ్‌గా అవకాశం వస్తే ఉన్న ఆటగాళ్లతోనే జట్టును తిరుగులేని శక్తిగా మారుస్తానని చెప్పారు. కోహ్లి, రోహిత్ వంటి విలువైన ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిద్దరూ రంజీ ట్రోపీల్లో ఆడేలా చూస్తానని, టెస్టుల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా వారికి మద్దతుగా ఉంటానని తెలిపారు.
ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారని కానీ, ఆటగాళ్ల కష్టకాలంలో వారికి అండగా ఉండాలని అన్నారు. అవసరమైతే రోహిత్‌ను రోజుకు 20 కిలోమీటర్లు పరుగెత్తిస్తానని, కానీ, వారిని వదులుకోనని ఆయన స్పష్టం చేశారు.