కోల్‌కతా వేదికగా జరిగిన పింక్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం మూడు రోజుల్లోనే గెలుపును అందుకుంది. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. ముఖ్యంగా, టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్... 9 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 152/6 పరుగులు చేసింది. ఈ ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్... ఏమాత్రం పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌట్ అయింది.
మూడో రోజు ఆటలోనూ బంగ్లా బ్యాట్స్ మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్‌కు క్యూకట్టారు. షాద్మాన్ ఇస్లాం 0, ఇమ్రుల్ 5, మోమినుల్ 0, మిథున్ 6, రహీం 74, మహ్మదుల్లా 39 (రిటైర్డ్ హర్ట్), మిరాజ్ 15, తైజుల 11, అల్ అమిన్ 21, ఎడాబట్ 0 పరుగులకు వెనుదిరిగారు. అబు జాయెద్ 2 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 41.1 ఓవర్లకి 195 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది.
ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో రెండు టెస్టుల సీరిస్ భారత్ సొంతమైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు, ఇషాంత్ నాలుగు వికెట్లు తీశారు.